ముఖ్యమంత్రి హోదా లో కెసిఆర్ గారి యాదగిరిగుట్ట మొట్ట మొదటి పర్యటన, తదుపరి ప్రకటన ల తరువాత యాదగిరిగుట్ట ఒక ఆద్యాత్మిక క్షేత్రంగా, విశ్వనగరంగా రూపొందబోతుందని పట్టణ ప్రజలు చాలా సంతోసించారు, ఇటువంటి ప్రకటనలు గతంలో చాలా విన్నారు, కానీ ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటన చేసేసరికి ప్రజల్లో చాలా నమ్మకం ఏర్పడింది. దానికనుగుణంగా బడ్జెట్లో వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం, చక చకా ఆలయ పునర్నిర్మాణం పనులు జరుగుతుండంతో యాదగిరిగుట్ట రూపు రేఖలు మారబోతున్నాయి అనుకున్నారు, YTDA ఏర్పాటు అయ్యింది, గ్రామ పంచాయతీ కాస్త మునిసిపాలిటీ అయ్యింది, అంతా అద్బుతంగా పనులు జరుగుతూ వచ్చాయి. అప్పటికింకా పట్టణంలో ఎలాంటి పనులు మొదలు కాలేదు, అభివృద్ది అంతా కొండపైనే జరిగినది.
ఆలయ పునః ప్రారంభానికి ముందు, పట్టణం లో రహదారులు వెడల్పు చేసే పనులు మొదలయ్యాక, ప్రజల్లో భయాందోళనలు, భవిష్యత్ పై అనుమానాలు, ఏం జరగబోతుందోనని ఒక గుబులు మొదలైంది, విశ్వసనీయ సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా, ఎలాంటి వివాదాలు లేకుండా, ప్రజలకు సంతృప్తికరమైన నష్ట పరిహారం ఇవ్వవల్సినదిగా ఆదేశించారు. ఆవిదంగా పట్టణంలో ప్రదాన రహదారుల వెంట కూల్చివేతలు జరిగి, కొండపై వెళ్ళడానికి రింగ్ రోడ్డు, సగం వరకు ప్రదాన రహదారి నిర్మించారు. అటు తరువాతే పట్టణ ప్రజలకు ఇబ్బందులు మొదలవ్వడం ప్రారంబమయ్యింది.
భక్తులు కొండమీదికి సాఫీగా వెళ్ళే పనులు చేసిన అదికారులు, స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సాఫీగా వెళ్ళేలా ప్రణాళికలు వేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం స్థానికులు ఎదురుకొంటున్న సమస్యలు :
1. స్థానిక ప్రజలు కొండమీదికి వెళ్లాలంటే, బస్టాండ్ వరకు వెళ్ళి యూ టర్న్ తీసుకోవలసిన పరిస్థితులు
2. పట్టణంలోని సర్వీసు రోడ్డు పనులు పూర్తికాలేదు
3. రోడ్ల పై పార్కింగ్ సౌకర్యం లేదు
4. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా మొదలు కాలేదు
5. మెయిన్ రోడ్డు లో నుంచి పట్టణంలోని వీదుల లోకి కార్లు, బస్సులు వెల్ల లేని పరిస్థితి
6. నిర్మాణ సామగ్రి తో వచ్చే భారీ వాహనాలు నేరుగా వీదుల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు
7. నీటి సరఫరా లో తరచూ తవ్వకాలతో అంతరాయం
8. మిషన్ భగీరథ యాదగిరిగుట్ట లో ఎంతవరకు అమలు అవుతుందో తెలియని పరిస్థితి
9. గతంలో కొండమీది పనులంటూ తరచూ విద్యుత్ కోతలు (ఇప్పుడు కొంచె తగ్గాయి, అయిన రోజు ఇప్పటికీ అప్రకటిత విద్యుత్ అంతరాయం జరుగుతూనే ఉంటుంది)
10. ZPHS (Boys), ZPHS (Girls) స్కూళ్లకు అసలు దారి లేకుండా రోడ్డు నిర్మాణం చేయడం, విద్యార్థులు, ఉపాద్యాయులు రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ గారు స్వయంగా వచ్చి చూసిన కూడా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
11. రింగ్ రోడ్డు చుట్టూ కట్టిన కాలువల నుండి నీరు నేరుగా వెళ్ళకుండా పట్టణంలో కి వస్తూ, పట్టణం మొత్తం ఒక లోతట్టు ప్రాంతం గా మారుతుంది.
12. పనులు పూర్తి కాక పోవడంతో యాదగిరిగుట్ట నుంచి యాదగిరిపల్లి వెళ్ళే రహదారి ఘోరంగా మారింది, తరచూ ఇక్కడ వాహణదారులు క్రింద పడిపోవడం, ఆక్సిడెంట్లు జరగడం జరుగుతుంది.
13. యాదగిరిగుట్ట నుంచి పాతగుట్ట వెళ్ళే రహదారి అద్వాన్నంగా మారింది
14. అద్వాన్న పట్టణంలోకి స్వాగతిస్తున్నట్టు పాతగుట్ట చౌరస్తా దగ్గర పెద్ద గోతి
ఇలా రాసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ అదికారులకు, YTDA వారికి, దేవస్థానం వారికి, మునిసిపాలిటీ వారికి తెలియంది కాదు, ప్రశ్నిస్తే ఎవరి వాదన వాళ్ళు, ఎవరి వివరణ వాళ్ళు ఇచ్చుకుంటారు, కానీ ఈ పనులన్నీ చేయవలసినది ఎవరు? ఎంతకాలం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతారు అనేది అదికారులందరు ఆత్మ సాక్షిగా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, వారికి ఉన్న ఇబ్బందులను పై అదికారులకు తెలియచేయాలి, లేదా ప్రజల ముందు పెట్టాలి, కానీ ఎవరికి వారు జరుగుతున్న అసౌకర్యాలని మౌనంగా చూస్తూ కూర్చోవటం వలన ప్రజలకు హానీ చేసినవారే అవుతారు.
ముఖ్యమంత్రి గారే అన్నీ దగ్గరుండి చేస్తున్నారని ఇన్ని సమస్యలున్న ప్రజలంతా మౌనంగా వేచి చూస్తున్నారు, కానీ పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది, అది ప్రజల్లో అలజడి కి కారణమవుతుంది, స్థానిక ఉద్యమానికి కూడా అవకాశమోస్తుంది. ఈ రోజు జరిగినది అదే, యాదగిరిగుట్ట నుంచి యాదగిరిపల్లి వరకు రోడ్డు బాగు చేయమని సాక్షాత్తు మునిసిపల్ కౌన్సిలర్ లే వచ్చి రోడ్డు పై దర్నా చేయవలసి వచ్చింది, ప్రజలు వారితో అండగా నిలిచారు. ఇది ఆరంభం మాత్రమే.